జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • జనరల్ సెక్రటరీ పదవికి ఏ స్థాయి ఉంటుందో చూడాలని ఎద్దేవా
  • బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని వ్యాఖ్య
  • జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్ఠానం భావించిందన్న ఎంపీ
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగానే కేసీఆర్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని, కానీ ఆ పదవి స్థాయి ఏమిటనేది ఆయనకే తెలియాలని భుననగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్‌లో చేరడంతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావించిందని తెలిపారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో అలిగినట్లుగా బీఆర్ఎస్ పార్టీలో అలిగితే పట్టించుకోరని విమర్శించారు. పొన్నాల లక్ష్యయ్య పీసీసీ ప్రెసిడెంట్‌గా చేసి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడాలని అన్నారు. ఆయన వీడియోలు చేసుకుని సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని, రేపు జీవన్ రెడ్డి పరిస్థితి అంతే అన్నారు.

బండి సంజయ్‌పై చామల ఆగ్రహం

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమని చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మెట్రో ఫేజ్ 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళన అంశాల్లో బీజేపీ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి జరిగిందని భావిస్తే, సీబీఐ ఆయన శాఖ పరిధిలోనే ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఆదేశిస్తే 24 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి తొమ్మిది నెలల క్రితం చెప్పారని గుర్తు చేశారు. కానీ సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అవసరం లేని వాటికే సీబీఐ, ఈడీలను బీజేపీ ప్రయోగిస్తోందని ఆరోపించారు.

Chamala Kiran Kumar reddy responds on Jeevan reddy
Jeevan Reddy joins BRS

More Telugu News